కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి కన్నుమూత
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జి. వెంకటస్వామి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా వెంకటస్వామి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన వెంకట స్వామి అక్టోబర్ 5వ తేదీ 1929 సంవత్సరంలో జన్మించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా పలు పదవులు చేపట్టారు. ఆయన కుమారులు వినోద్ మంత్రిగా, డాక్టర్ వివెక్ ఎంపీగా పదవులు నిర్వహించారు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో ముషీరాబాద్ జైలు దగ్గర జరిగిన కాల్పుల్లో కాకా గాయపడ్డారు. ఉద్యమకారులను పోలీసులు హింసిస్తున్నారని తెలుసుకున్న కాకా పార్లమెంట్ సభ్యుడై ఉండి తెలంగాణ ఉద్యమకారులను రక్షించడానికి జైలు వద్దకు వెళ్లారు. అక్కడ జరిగిన కాల్పుల్లో కాకా కాలికి గాయమైంది. నేషనల్ హట్స్ సొసైటీ కింద వేల మంది పేదలకు ఆయన గుడిసెలు నిర్మించారు. అప్పటి నుంచి ఆయనను గుడిసెల వెంకటస్వామిగా పిలుస్తారు. కాకా స్థాపించిన విద్యాసంస్థను ఒక్క రూపాయి డొనేషన్ తీసుకోకుండా నిర్వహిస్తున్నారు.
సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి:
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జి. వెంకటస్వామి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయల్లో పలు పదవుల్ని చేపట్టిన కాకా దేశానికి సేవలందించారని కొనియాడారు. కాకా తెలంగాణ కోసం పరితపించిన నేత, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత తెలంగాణ అభివృద్ధి కోసం పరితపించారని గుర్తు చేశారు. వెంకటస్వామి కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాకా అంత్యక్రియలు ప్రభుత్వ లాంచనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
పలువురి సంతాపం :
కాక మృతిపట్ల గవర్నర్ నరసింహన్ సంతాపం తెలిపారు. కాకా మరణం దేశానికి, రాష్ర్టానికి తీరని లోటని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు, వైఎస్ఆర్ సీపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా, తెలంగాణ కాంగ్రెస్ నాయకలు పొన్నాల, డీఎస్, పొన్నం, రాజయ్య సంతాపం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్ వెంకటస్వామి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాకా మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. నూటికి నూరు శాతం నిఖర్సైన కాంగ్రెస్ వాది కాక అని దిగ్విజయ్ తెలిపారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








